షేర్: f 𝕏 ✉ ✈ in @
sudasmedia.in 04 జూలై 2026, 7:26 ఉద.
జాతీయ రాజకీయాలు

అమెరికా జోక్యంతోనే భారత్–పాక్ బ్యాక్‌డోర్ దౌత్యం?. దౌత్య వ్యూహంలో మార్పుకు సంకేతాలా?

అమెరికా జోక్యంతోనే భారత్–పాక్ బ్యాక్‌డోర్ దౌత్యం?. దౌత్య వ్యూహంలో మార్పుకు సంకేతాలా? పాక్ పట్ల బిజేపి – ఆర్ఎస్ఎస్ ల దృష్టికోణంలో మార్పా ?…
ప్రచురణ తేదీ: 04 జూలై 2026, 7:26 ఉద. రచన: oneadmin
22 వీక్షణలు 0 వ్యాఖ్యలు
అమెరికా జోక్యంతోనే భారత్–పాక్ బ్యాక్‌డోర్ దౌత్యం?. దౌత్య వ్యూహంలో మార్పుకు సంకేతాలా?

అమెరికా జోక్యంతోనే భారత్–పాక్ బ్యాక్‌డోర్ దౌత్యం?. దౌత్య వ్యూహంలో మార్పుకు సంకేతాలా?

పాక్ పట్ల బిజేపి – ఆర్ఎస్ఎస్ ల దృష్టికోణంలో మార్పా ?

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, 9391533339.

భారత్–పాకిస్తాన్ సంబంధాలు గత ఏడు దశాబ్దాలుగా యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఉద్రిక్తతలు, దౌత్య వివాదాలతో సాగుతున్నాయి. ముఖ్యంగా పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య అధికారిక దౌత్య చర్చలు దాదాపు నిలిచిపోయాయి. “ఉగ్రవాదం, చర్చలు రెండూ కలిసి సాగవు” అనే విధానాన్ని భారత్ పదేపదే ప్రకటించింది.

అయితే ఇటీవలి ఏడాది కాలంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లండన్ కు  చెందిన అంతర్జాతీయ వ్యూహాత్మక పరిశోధనా సంస్థ ఐ ఐ ఎస్ ఎస్ (International Institute for Strategic Studies – IISS) నిర్వహించిన సమావేశాలు లేదా దాని సదస్సుల సందర్భంగా భారత్–పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య Track-1.5, Track-2 స్థాయి అనధికారిక చర్చలు జరిగినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం దౌత్య, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇవన్నీ బిజేపి పూర్వ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు రామ్ మాధవ్, ఆర్ ఎస్ ఎస్ నాయకులు దత్తాత్రేయ హోస బోలె అమెరికా, యూరోప్ పర్యటనల తరువాత మరింతగా బలం పుంజుకొన్నాయి. దత్తాత్రేయ హోస బోలె ఇటీవల పిటిఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, భారత్ – పాక్ ల మధ్య సామాజిక, సాంస్కృతిక రంగాలలో ప్రజల మధ్య చర్చలు కొనసాగాలని తెలిపారు. దీన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక మోహన్ భగవత్ కూడా సమర్థిస్తూ ప్రకటన చేశారు.

పాక్ పట్ల మొదటి నుండి వ్యతిరేకంగా ఉండే ఆర్ఎస్ఎస్, బిజేపి నాయకులు, ఒక్కసారిగా తమ పద్దతి మార్చుకొని, పాక్ పట్ల మెతక వైఖరితో వ్యవహరించడంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒత్తడి ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆపరేషన్ సిందూర్ తరువాత అమెరికా వైఖరి పూర్తిగా పాక్ కు అనుకూలంగా ఉండడం, యుద్దాన్ని మేమే అపమని ట్రంప్ ప్రకటించడం, ఆతరువాతి వ్యాపార  ఒప్పందం సంఘటనలు అన్నీ ఈ వాదనకు బలం ఇస్తున్నాయి. ఇరాన్ – అమెరికా యుద్ద విరామంలో కూడా పాక్ చురుకుగా పాల్గొనడంతో, అమెరికా పూర్తిగా పాక్ కు అనుకూలంగా, భారత్ పై వోత్తడి తెస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

అసలు ఈ అనధికార సమావేశాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ ఒక్క సారిగా పాక్ – భారత్ ల మధ్య ఒక సంవత్సర కాలంలో 6 సార్లు ఈ సమావేశాలు జరగడం,  భారత తరఫున మాజీ ఆర్మీ చీఫ్  మనోజ్ ముకుంద నరవానే,  మాజీ దౌత్యవేత్త రుచి ఘనశ్యామ్, బిజేపి నాయకులు రామ్ మాధవ్  పేర్లు ప్రస్తావించబడ్డాయి. పాకిస్తాన్ తరఫున శ్ర్రీ రహమాన్, సజ్జయిడ్ హైదర్ ఖాన్, పూర్వ ఐ ఎస్ ఐ నేతలు తదితరుల పేర్లు మీడియాలో వచ్చాయి.Track-1.5, Track-2 దౌత్యం అధికారిక ప్రభుత్వ చర్చలు కావు. మాజీ దౌత్యవేత్తలు, రిటైర్డ్ సైనికాధికారులు, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు, థింక్‌ట్యాంక్‌ల ప్రతినిధులు పాల్గొని పరస్పర అభిప్రాయాలు పంచుకునే వేదికగా వీటిని భావిస్తారు. ప్రపంచంలోని అనేక సంక్షోభ ప్రాంతాల్లో ఇలాంటి చర్చలు గతంలో కూడా జరిగాయి.

గత ఏడాది జూలైలో లండన్‌లో జరిగిన IISS ట్రాక్ -1.5 సమావేశంతో ఈ శ్రేణి చర్చలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. భారత, పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు, వ్యూహకర్తలు ఇందులో పాల్గొన్నట్లు మీడియా నివేదించింది. ఆ తరువాత అక్టోబర్‌లో ఒమాన్‌లోని మస్కట్‌లో జరిగిన దక్షిణ ఆసియా రక్షణ సంవేశం (Southern Asia Security Conference) సందర్భంగా మరో ట్రాక్ -1.5 సమావేశం జరిగినట్లు సమాచారం వెలువడింది. ఈ సమావేశంలో కూడా ఇరు దేశాల మాజీ అధికారులు, వ్యూహాత్మక నిపుణులు పాల్గొన్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

డిసెంబర్‌లో థాయ్‌లాండ్‌లో మరో ట్రాక్ 2 సమావేశం జరిగింది. ఇది IISS కార్యక్రమం కాకపోయినా, భారత్–పాక్ మధ్య అనధికారిక సంభాషణల శ్రేణిలో భాగంగా ప్రస్తావించబడింది. ఇందులో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ దౌత్యవేత్తలు, విద్యావేత్తలు పాల్గొన్నట్లు నివేదికలు వచ్చాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖతార్ రాజధాని దోహాలో మరో Track-2 సమావేశం జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఒక థింక్‌ట్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూడా ఇరు దేశాలకు చెందిన మాజీ దౌత్యవేత్తలు, వ్యూహాత్మక నిపుణులు పాల్గొన్నట్లు సమాచారం వెలువడింది.

అత్యంత చర్చనీయాంశమైన సమావేశం జూన్ లో  శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన IISS South Asia Dialogue సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఈ సదస్సు పక్కన భారత్–పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య అనధికారిక చర్చలు జరిగినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కొంతమంది భారత, పాకిస్తాన్ ప్రముఖుల పేర్లు మీడియాలో ప్రస్తావించబడ్డాయి. అయితే వారిలో కొందరు తమ పాల్గొనడాన్ని బహిరంగంగా ఖండించగా, IISS కూడా పూర్తి పాల్గొనేవారి జాబితాను విడుదల చేయలేదు.

ఈ సమావేశాలపై వార్తలు వెలువడిన తర్వాత భారత ప్రభుత్వం స్పందిస్తూ, ఇవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావని, ప్రభుత్వం తరఫున ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ చర్చలు పూర్తిగా స్వతంత్ర స్థాయిలో జరిగాయా, లేక విధాన చర్చలకు అనుబంధ వేదికలుగా పనిచేస్తున్నాయా అనే అంశంపై చర్చ మొదలైంది.

ఈ పరిణామాల మధ్య RSS సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదంపై రాజీ ఉండదని చెబుతూనే, పాకిస్తాన్‌తో సంభాషణల తలుపులు పూర్తిగా మూసివేయకూడదని ఆయన అన్నారు. తరువాత RSS సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ కూడా సంభాషణను పూర్తిగా తిరస్కరించకూడదనే భావనను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను కొందరు దౌత్యపరమైన పరిపక్వతగా చూడగా, మరికొందరు అధికారిక రాజకీయ వైఖరితో పోల్చి విశ్లేషించారు.

దౌత్య నిపుణుల అభిప్రాయం ప్రకారం Track-2 సమావేశాలు ప్రభుత్వ విధానానికి ప్రత్యామ్నాయం కావు. అయితే అధికారిక చర్చలు నిలిచిపోయిన సమయంలో సంక్షోభ నిర్వహణ, పరస్పర అవగాహన, అపార్థాల నివారణ వంటి అంశాల్లో ఇవి సహాయకరంగా ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా–చైనా, అమెరికా–ఇరాన్, ఉత్తర కొరియా–దక్షిణ కొరియా వంటి దేశాల మధ్య కూడా గతంలో ఇలాంటి అనధికారిక చర్చలు జరిగాయి.

అయితే భారత్–పాకిస్తాన్ సంబంధాల విషయంలో ప్రజల్లో ఒక సహజమైన ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు ఉగ్రవాదంపై కఠిన వైఖరి ప్రకటిస్తూనే, మరోవైపు అనధికారిక స్థాయిలో సంభాషణలు కొనసాగడం పరస్పర విరుద్ధమా? లేక ఇది అంతర్జాతీయ దౌత్యంలో సహజమైన ద్వంద్వ వ్యూహమా? దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే, IISS వేదికగా లేదా ఇతర అంతర్జాతీయ థింక్‌ట్యాంక్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలు అధికారిక భారత్–పాకిస్తాన్ చర్చలు కావు. అదే సమయంలో, దక్షిణాసియా భద్రతా పరిస్థితులు, అణ్వాయుధ సమతుల్యత, ఉగ్రవాదం వంటి అంశాల నేపథ్యంలో ఇలాంటి అనధికారిక దౌత్య వేదికలకు అంతర్జాతీయ ప్రాధాన్యం పెరుగుతున్నదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

భవిష్యత్తులో ఈ ట్రాక్ -1.5, ట్రాక్ -2 చర్చలు అధికారిక దౌత్యానికి మార్గం సుగమం చేస్తాయా? లేక మేధోపరమైన చర్చలకే పరిమితమవుతాయా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అయితే గత ఏడాది కాలంలో వరుసగా జరిగిన ఈ సమావేశాలు భారత్–పాకిస్తాన్ సంబంధాల్లో అనధికారిక దౌత్యం ఇంకా సజీవంగానే ఉందని సూచిస్తున్నాయి.

————-

Note:This article was originally published in Mana Telangana Telugu daily on 03-06-2026

#జాతీయరాజకీయాలు #రాజకీయాలు #ప్రపంచం
అమెరికా జోక్యంతోనే భారత్–పాక్ బ్యాక్‌డోర్ దౌత్యం?. దౌత్య వ్యూహంలో మార్పుకు సంకేతాలా? పాక్ పట్ల బిజేపి – ఆర్ఎస్ఎస్ ల దృష్టికోణంలో మార్పా ? -సిహెచ్ వి ప్రభాకర్ రావు,…