షేర్: f 𝕏 ✉ ✈ in @
sudasmedia.in 25 సెప్టెం 2026, 7:31 ఉద.
విద్య

విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వాలు మేల్కొనాలి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఫీజులు, ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణలో పారదర్శకతపై ఇటీవల, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్.వి.…
ప్రచురణ తేదీ: 25 సెప్టెం 2026, 7:31 ఉద. రచన: oneadmin
15 వీక్షణలు 0 వ్యాఖ్యలు
విద్య వ్యాపారం కాదు.. ప్రజల హక్కు

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వాలు మేల్కొనాలి

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఫీజులు, ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణలో పారదర్శకతపై ఇటీవల, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్.వి. అంజారియా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు దేశ విద్యారంగంపై కీలక చర్చకు దారితీశాయి. విద్యాసంస్థలు లాభాల కోసం నడిచే వ్యాపార సంస్థలుగా మారకూడదని, విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు ఎలా వినియోగిస్తున్నారో పారదర్శకంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఆడిట్ నివేదికల సమర్పణకు ఆరువారాల గడువు ఇచ్చింది. ఈ తీర్పు ప్రైవేట్ విద్యాసంస్థలకే కాదు, ప్రభుత్వ విద్యారంగానికి కూడా ఒక మేలుకొలుపు కావాలి.

ఒక రకంగా, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు, సామాన్యులను ఉన్నత విద్య కు దూరం చేస్తున్నాయనే విమర్శలకు, ఆరోపణలకు ఈ తీర్పు అద్దం పడుతుంది. దశాబ్దాల కాలంగా పేదలకు ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించక ప్రభుత్వాలు వాటి ఔన్నత్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి పేర ఉన్న వాటిని కూడా వ్యాపార దొరణీలో నడపాలని చూస్తున్నాయి. నిజానికి ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అన్నీ కార్పొరేట్ సంస్థలవి లేదా రాజకీయ నాయకులవే అనేడ్ విషయాన్ని మారిచిపోకూడదు. ఇప్పుడు చట్టాలు చేసేదీ కూడా వీరే. యువతలోని చైతన్యమే విశ్వవిద్యాలయాల మనుగడకు ప్రధానం.

ఒకవైపు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఫీజులు, ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతుంటే, మరోవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. మౌలిక వసతులు, హాస్టళ్లు, ప్రయోగశాలలు అవసరమైన స్థాయిలో లేకపోవడం ఆందోళనకరం. ప్రభుత్వ విద్యాసంస్థలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా స్వయం సమృద్ధి సాధించాలనే ఒత్తిడి పెరిగితే చివరకు విద్యార్థులపైనే ఫీజుల భారం పడే ప్రమాదం ఉంది.

ఇంకో తీవ్రమైన సమస్య అధ్యాపకుల ఖాళీ పోస్టులు. వేలాది బోధనా పోస్టులు ఖాళీగా ఉండగా, అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒకవైపు తరగతి గదిలో అధ్యాపకుల కొరత, మరోవైపు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత,, ఈ వైరుధ్యానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. సకాలంలో నియామకాలు చేపట్టకపోవడం విద్యా ప్రమాణాలను దెబ్బతీయడమే కాక యువతలో నిరాశను పెంచుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం కూడా పరిష్కారం కాదు. పాఠశాలలను బలోపేతం చేసి, ఉపాధ్యాయులను నియమించి, మౌలిక వసతులు కల్పించాలి. అదే సమయంలో ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విలువైన భూములను ఇతర అవసరాలకు మళ్లించే విషయంలో అత్యంత పారదర్శకత అవసరం. అవి ప్రజల ఆస్తులు; భవిష్యత్ తరాల విద్యా అవసరాలకు వాటిని కాపాడాలి.

ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలు అవసరమే. కానీ విద్య, వైద్యం వంటి శాశ్వత ప్రజా సేవలను బలోపేతం చేయడం మరింత ముఖ్యమైన ప్రభుత్వ బాధ్యత. ఒక కుటుంబానికి తాత్కాలిక ఆర్థిక సహాయం కొంతకాలం మాత్రమే ఉపయోగపడుతుంది; నాణ్యమైన విద్య మాత్రం ఒక తరాన్ని మార్చగలదు.

కేంద్రంలో ఏ పార్టీ, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పారదర్శకతను నిర్ధారించడంతో పాటు ప్రభుత్వ విద్యకు తగిన నిధులు, ఖాళీ పోస్టులకు నియామకాలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుబాటు విద్య కల్పించాలి.

విద్య వ్యాపారం కాదు. ప్రజల హక్కు. ఆ హక్కును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బలహీన, బహుజన వర్గాలను విద్యకు దూరం చేయడం సంక్షేమానికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికే యుజిసి లాంటి సంస్థలను నామామాత్రానికే పరిమితం చేస్తూ, ఉన్నత విద్య ఆర్థిక సంస్థద్వారా నిధులు పొందాలనే నిబందనలు విశ్వవిద్యాలయాల మనుగడనే ప్రశ్నిస్తుంది. నిధుల కేటాయింపులో పారదర్శకత తో పాటు, జవాబుదారీతనం కూడా ఉండాలి. కానీ ఇచ్చిన నిధులకు గ్యారంటీ అడగడం, వీలైతే ఉన్న ఆస్తులను అమ్ముకోమని సలహాలు ఇవ్వడం అభివృద్ధి కాదు. ప్రైవేటుకు ధీటుగా అనే నినాదాన్ని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ధీటుగా అన్నట్లుగా ప్రణాళికలు, నిధులు కావాలని యువత కోరుకొంటుంది.

——————–

#విద్య #స్కూల్విద్య #విశ్వవిద్యాలయాలు
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వాలు మేల్కొనాలి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఫీజులు, ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణలో పారదర్శకతపై ఇటీవల, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్.వి. అంజారియా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు…