సిహెచ్, వి. ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్టు,9391533339
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశంగా చెప్పుకుంటోంది. “డెమోగ్రాఫిక్ డివిడెండ్” అని గర్వంగా ప్రకటిస్తోంది. కానీ ఈ యువశక్తిని నడిపించాల్సిన విద్యా వ్యవస్థ మాత్రం నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో లక్షలాది మంది పోటీ పడుతుండగా, మరోవైపు ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి భవిష్యత్తు కూడా పూర్తిగా భద్రమైందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దేశంలో కొద్ది ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే మెరుగైన అవకాశాలు లభిస్తుండగా, మిగిలిన లక్షలాది మంది డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్య పూర్తి చేసినప్పటికీ సాధారణ గ్రాడ్యుయేట్లతో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు.
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల హామీలు క్షేత్రస్థాయిలో యువత జీవితాల్లో ప్రతిఫలించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉద్యోగాల కొరత మాత్రమే కాదు; విద్యా వ్యవస్థ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో విఫలమవడమే. ఆటోమేషన్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిణామాలు తక్కువ మంది ఉద్యోగులతోనే అధిక ఉత్పత్తి సాధ్యమయ్యే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో మన విద్యా విధానం వెనుకబడింది.
భారతీయ విద్యా సంప్రదాయం జ్ఞానం, శీలం, సమాజ ఐక్యతను నిర్మించే సాధనంగా విద్యను భావించింది. తక్షశిల, నాలంద వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించాయి. కానీ నేడు అనేక విద్యాసంస్థల్లో శాస్త్రీయ చర్చలకు బదులుగా రాజకీయ, సామాజిక విభజనలు ప్రాధాన్యం పొందుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయాలు కొత్త ఆలోచనలకు కేంద్రాలుగా కాకుండా, భావజాల పోరాటాలకు వేదికలుగా మారితే దేశ పరిశోధనా సామర్థ్యం దెబ్బతింటుంది. విజ్ఞానం విస్తరించాల్సిన చోట విద్వేషం పెరగడం దేశాభివృద్ధికే కాదు, జాతీయ ఐక్యతకు కూడా ప్రమాదకరం.
భారత ఉన్నత విద్యా వ్యవస్థలో మరో తీవ్రమైన సమస్య నాణ్యతలోని అసమానత. కొద్దిమంది అగ్రశ్రేణి సంస్థలు ప్రపంచ ప్రమాణాలకు చేరువలో ఉండగా, వేలాది విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కనీస మౌలిక వసతులు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన నిధులు, శాశ్వత అధ్యాపకులు కూడా లేరు. ప్రభుత్వ వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో పెద్ద సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటం, ఉపకులపతి వంటి కీలక పదవులు నెలల తరబడి భర్తీ కాకపోవడం విద్యా పరిపాలనలోని నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రైవేటు రంగంలో ఒకే అధ్యాపకుడు పలుచోట్ల బోధించే పరిస్థితి నాణ్యమైన బోధనకు ఎంతటి ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూడడం మరో ఆందోళనకర పరిణామం. ప్రైవేటీకరణతో విద్యాసంస్థల సంఖ్య పెరిగినా, పరిశోధన నాణ్యత పెరగలేదు. డిగ్రీలు పెరిగాయి కానీ ఆవిష్కరణలు పెరగలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నేడు సంపదను సృష్టిస్తున్నవి భూములు, భవనాలు కాదు; పేటెంట్లు, పరిశోధనలు, మేధోసంపత్తి. ఈ వాస్తవాన్ని మన విద్యా విధానం ఇంకా పూర్తిగా గ్రహించినట్లు కనిపించడం లేదు.

చైనా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానం చేశాయి. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, అంతరిక్ష సాంకేతికత, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, రక్షణ పరిశోధనలపై దశాబ్దాలుగా భారీ పెట్టుబడులు పెట్టాయి. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వాలు కలిసి పనిచేసే వ్యవస్థను నిర్మించాయి. ఫలితంగా ప్రపంచ సాంకేతిక రంగంలో నాయకత్వాన్ని సాధించగలిగాయి.
ఇరాన్ ఉదాహరణ కూడా ఆసక్తికరమే. దీర్ఘకాలిక ఆర్థిక ఆంక్షల మధ్య కూడా స్వదేశీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా డ్రోన్ సాంకేతికత, క్షిపణి వ్యవస్థలు, రక్షణ పరిశోధనల్లో గణనీయమైన పురోగతి సాధించింది. అదే సమయంలో ఫిన్లాండ్ వంటి చిన్న దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థను నిర్మించి మానవ వనరులను అత్యంత విలువైన జాతీయ సంపదగా మార్చుకుంది. ఈ రెండు ఉదాహరణలు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి—దేశ భవిష్యత్తును నిర్ణయించేది ప్రకృతి సంపద కాదు; విద్య, పరిశోధనలపై పెట్టే పెట్టుబడి మరియు నాయకత్వ దూరదృష్టి.
భారత్ అంతరిక్ష పరిశోధన, ఔషధ తయారీ, డిజిటల్ సాంకేతికత వంటి కొన్ని రంగాల్లో ప్రపంచస్థాయి విజయాలు సాధించింది. అయితే ఆ విజయాలు మొత్తం విద్యా వ్యవస్థలో ప్రతిబింబించడం లేదు. విద్యాసంస్థల సంఖ్య పెరగడం అభివృద్ధికి ప్రమాణం కాదు. అక్కడి ప్రయోగశాలలు, అధ్యాపకుల నాణ్యత, పరిశోధనల సంఖ్య, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ ప్రమాణాల పాఠ్యాంశాలే అసలైన ప్రమాణాలు.
ఇప్పటి వరకు మన పారిశ్రామిక విధానం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ విదేశీ పరిశ్రమలు కేవలం ఉత్పత్తి కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేస్తే, అత్యంత విలువైన పరిశోధన, రూపకల్పన, మేధోసంపత్తి మాత్రం తమ దేశాల్లోనే ఉంచుకుంటాయి. దీని వల్ల ఉపాధి కొంత లభించినా, సాంకేతిక స్వావలంబన సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రతి పెద్ద పరిశ్రమ విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా స్వంత పరిశోధన విభాగాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి చేసే విధానాలు అవసరం.
జాతీయ విద్యా విధానం కేవలం పాఠ్యాంశాల మార్పులతో పరిమితం కాకూడదు. ఏఐ, సెమీకండక్టర్ రూపకల్పన, కొత్త శక్తి వనరులు, మెటలర్జీ, క్వాంటం సాంకేతికత, జీవసాంకేతికత, రక్షణ పరిశోధన, అంతరిక్ష విజ్ఞానం వంటి భవిష్యత్ రంగాలకు ప్రత్యేక జాతీయ పరిశోధన మిషన్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులు డిగ్రీ కోసం కాకుండా ఆవిష్కరణ కోసం చదివే వాతావరణాన్ని కల్పించాలి. విశ్వవిద్యాలయాలను ఉద్యోగాల తయారీ కేంద్రాలుగా కాకుండా, జ్ఞాన సృష్టి కేంద్రాలుగా మార్చినప్పుడే భారతదేశం నిజమైన విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.
భారత్ ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. ఈ జనాభా ఒక అవకాశమా, లేక భారమా అన్నది రాబోయే రెండు దశాబ్దాల్లో విద్యా విధానం తీసుకునే దిశపై ఆధారపడి ఉంటుంది. డిగ్రీలు ఇచ్చే దేశం కావడం సరిపోదు; ప్రపంచానికి కొత్త సాంకేతికతను అందించే దేశంగా మారాలి. ఆ మార్పు విద్యలో మొదలవుతుంది. విద్యలో పెట్టుబడి అనేది ఖర్చు కాదు, దేశ భవిష్యత్తుపై చేసే అత్యంత విలువైన పెట్టుబడి.
————-





