హైదరాబాద్, మార్చ్ 18 (ప్రజా మంటలు):
భవిష్యత్‌పై గంపెడాశలతో బాసర ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థిని అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం అత్యంత దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తేజస్విని అనారోగ్యానికి గురైనప్పటికీ సరైన చికిత్స అందించకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈనెల 13న అనారోగ్యం పాలైన వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించి ఉంటే తేజస్విని ప్రాణాలు కాపాడగలిగేవారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వైద్య సదుపాయాల దుస్థితి బహిర్గతమైందని కవిత విమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు.తేజస్విని మృతికి వైస్ చాన్స్‌లర్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. వీసీపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.అదేవిధంగా, తేజస్విని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలని,
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. మెరుగైన వైద్య సేవలతో పాటు ఆధునిక మెడికల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.విద్యార్థుల ప్రాణాలు అమూల్యమని, మరో విద్యార్థి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగింది?
మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన పీయూసీ 2వ సంవత్సరం విద్యార్థిని తేజస్విని (17) లుకేమియాతో బాధపడుతూ మృతి చెందింది.
క్యాంపస్‌లో అస్వస్థతకు గురై ఇంటికి వెళ్లిన ఆమె, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.
మృతి వార్తతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడమే కారణమని విద్యార్థుల ఆరోపణ.
వీసీ రావాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు పరిపాలన భవనాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు.





