సంస్థాగత విస్తరణకే పరిమితమా? లేక భవిష్యత్ రాజకీయ ప్రభావానికి పునాది వేస్తోందా?
-సిహెచ్. వి. ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, 9391533339.
ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ఉపాధి – విద్యా సమస్యలు, మాదకద్రవ్యాల విస్తరణపై కొత్త చర్చలు, కృత్రిమ మేధస్సు, సాంకేతిక మార్పులపై దృష్టి సారిస్తూ యువతతో అనుసంధానం పెంచుకోవడం ద్వారా సామాజిక ప్రభావాన్ని, భవిష్యత్ రాజకీయ ప్రభావాన్ని బలోపేతం చేసుకునే సంఘ్ వ్యూహాన్ని రూపొందించుకోంటుందా? జంతర్ మంతర్ లో జెన్ జి ధర్నా తరువాత జరిగిన ఆర్ ఎస్ ఎస్ మంతన్ లో ఎందుకు ఆందోళన కనిపించిందనే దానికి, తరువాత ఆర్ఎస్ఎస్ నాయకుల సమావేశంలో వెల్లడించిన అంశాలే నిదర్శనం. ప్రభుత్వంలో పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగం పై వాడివేది చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.
విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో, ఆగస్ట్ 19-21 లలో జరిగిన మూడు రోజుల అఖిల భారత సమన్వయ సమావేశం ఆర్ఎస్ఎస్ భవిష్యత్ దిశపై కొన్ని ఆసక్తికరమైన సంకేతాలను ఇచ్చింది. సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న 32 సంస్థలకు చెందిన 326 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, యువత ఆలోచనలు, వ్యవస్థలోని లోపాలు, అవినీతి, మాదకద్రవ్యాల విస్తరణ, కుటుంబ వ్యవస్థ, జనాభా మార్పులు, పర్యావరణం, ఆర్థిక స్వయం సమృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు ఆర్ఎస్ఎస్ వెల్లడించింది.
ఈ సమావేశంలో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన అంశం ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు, వ్యవస్థలోని లోపాలు, అవినీతి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ స్పందించడం గమనార్హం. యువత నిరసనలను కేవలం ఒక సంఘటనగా కాకుండా, వ్యవస్థలో ఉన్న లోపాల పట్ల వ్యక్తమవుతున్న అసంతృప్తిగా చూడాల్సిన అవసరాన్ని ఆర్ఎస్ఎస్ గుర్తించింది.
ఇది ఒక ముఖ్యమైన రాజకీయ సంకేతం. ఎందుకంటే ప్రభుత్వాలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పూర్తిగా విస్మరించడం ఏ రాజకీయ శక్తికైనా ప్రమాదకరం. విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, పరిపాలనా పారదర్శకత, అవినీతి వంటి అంశాలు నేటి యువత భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ అసంతృప్తి రాజకీయ ఓటుగా మారే అవకాశం ఉన్న సమయంలో, యువత మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్ఎస్ఎస్ కూడా గుర్తించినట్లు సమావేశ చర్చలు సూచిస్తున్నాయి.
అందుకే యువతపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ సమావేశంలో కీలక అంశంగా కనిపిస్తోంది. యువతకు కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా, వారితో ప్రత్యక్షంగా మాట్లాడాలి, వారి ఆలోచనలు, ఆశయాలు, సమస్యలను అర్థం చేసుకోవాలని సమావేశంలో చెప్పడం యాదృచ్ఛికం కాదు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతోందని కూడా సంస్థ వెల్లడించింది.
ఇక్కడే ఆర్ఎస్ఎస్కు ఒక పెద్ద సవాలు ఉంది. భారతదేశ యువతలో గణనీయమైన భాగం ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలు, కృత్రిమ మేధస్సు, ప్రపంచవ్యాప్త ఆలోచనా ధోరణులతో అనుసంధానమై ఉంది. సంప్రదాయ సంస్థాగత పద్ధతులతో మాత్రమే ఈ తరాన్ని ప్రభావితం చేయడం కష్టమవుతుంది. అందుకే యువతతో కొత్త రీతిలో సంభాషించాల్సిన అవసరాన్ని సంఘ్ గుర్తించినట్లు కనిపిస్తోంది.
ఇది కేవలం సామాజిక విస్తరణ కోసమేనా? లేక దీని వెనుక దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యం కూడా ఉందా అన్నది రాజకీయ పరిశీలకుల ముందున్న ప్రశ్న. ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష రాజకీయ పార్టీ కాదు. అయితే భారతీయ జనతా పార్టీతో దాని సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాల నేపథ్యంలో సంఘ్ సమాజంలో తన ప్రభావాన్ని విస్తరించడం చివరికి ఎన్నికల రాజకీయాలపై కూడా ప్రభావం చూపగలదు. యువతతో బలమైన అనుబంధం ఏర్పడటం భవిష్యత్లో రాజకీయ మద్దతు, ప్రజాభిప్రాయం, ఎన్నికల విజయాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించగలదన్నది విస్మరించలేని అంశం.
ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సుపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరగడం కూడా అత్యంత ప్రాధాన్యమైన విషయం. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు సాంకేతిక పరిణామాలను కేవలం సాంకేతిక సమస్యగా చూడటం లేదు. కృత్రిమ మేధస్సు ఉద్యోగాలు, విద్య, మీడియా, సామాజిక సంబంధాలు, సమాచార వ్యవస్థలపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాంకేతికతను భారతీయ సామాజిక సందర్భంలో ఎలా ఉపయోగించాలి, దాని ప్రతికూల ప్రభావాల నుంచి సమాజాన్ని ఎలా రక్షించాలి అనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది.
ఇది సంఘ్ తనను తాను కాలానుగుణంగా మార్చుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. ఒకవైపు కుటుంబం, సంస్కృతి, సామాజిక సామరస్యం వంటి సంప్రదాయ అంశాలను కొనసాగిస్తూనే, మరోవైపు కృత్రిమ మేధస్సు, నైపుణ్యాభివృద్ధి, యువత, డిజిటల్ సమాజం వంటి ఆధునిక అంశాలను స్వీకరించడం ద్వారా కొత్త తరంతో అనుసంధానం కావాలనే ప్రయత్నం కనిపిస్తోంది.
మాదకద్రవ్యాల సమస్యపైనా యువతను కేంద్రంగా చేసుకుని సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు, పోలీసులు, పరిపాలన కలిసి పనిచేయాలని చెప్పడం ద్వారా యువత సమస్యలను కేవలం నైతిక లేదా చట్టపరమైన అంశాలుగా కాకుండా సామాజిక సమస్యలుగా చూడాలనే దృక్పథాన్ని వ్యక్తం చేసింది.
అయితే ఈ సమావేశం ముందుకు తెచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఆచరణలోనే తేలాలి. అవినీతి, వ్యవస్థలో లోపాలు, యువత నిరుద్యోగం, విద్యా రంగంలోని అసమానతలు వంటి సమస్యలను కేవలం సామాజిక అవగాహనతో పరిష్కరించడం సాధ్యం కాదు. పారదర్శకమైన పరిపాలన, జవాబుదారీతనం, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, న్యాయమైన పోటీ వ్యవస్థ కూడా అవసరం.
ఆర్ఎస్ఎస్కు ఇది ఒక సాధారణ వార్షిక సమీక్ష కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగినదిగా కనిపిస్తోంది. సమాజంలో తన ఉనికిని కొనసాగించాలంటే యువతతో సంబంధం పెంచుకోవాలి; మారుతున్న సాంకేతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి; ప్రజల అసంతృప్తికి స్పందించాలి; సామాజిక సేవను విస్తరించాలి అన్న అవగాహన సంఘ్లో బలపడుతున్నట్లు కనిపిస్తోంది.
చివరికి ఇది కేవలం ఆర్ఎస్ఎస్ భవిష్యత్ సంస్థాగత వ్యూహానికి సంబంధించిన ప్రశ్న కాదు. భారత ప్రజాస్వామ్యంలో యువత ఎవరి వైపు నిలుస్తారు, ప్రభుత్వాలపై వారి అసంతృప్తి ఎలా రాజకీయంగా వ్యక్తమవుతుంది, సాంకేతిక పరిణామాలు రాజకీయ ప్రచారాన్ని ఎలా మార్చుతాయి, సామాజిక సంస్థలు ఎన్నికల రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతాయి అన్న పెద్ద ప్రశ్నలకు కూడా విశాఖ సమావేశం ఒక ముందస్తు సంకేతంగా నిలుస్తోంది.
———————–



