హైదరాబాద్, మే 28 :
ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టి రామారావు, స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశ చరిత్రలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి మహానాయకుల సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడిగా ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
తెలంగాణ నుంచి అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని, ఆ చరిత్రను ఎవరూ మరవలేరని సీఎం గుర్తుచేశారు. “ఈ విగ్రహావిష్కరణ నాకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన” అని పేర్కొన్నారు.
తెలంగాణను ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎం వివరించారు. 30 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణంతో పాటు ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకురానున్నట్లు తెలిపారు. కేవలం కంపెనీలను రప్పించడం మాత్రమే కాకుండా, తెలంగాణ యువతను ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, దీనికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం పథకమే స్ఫూర్తి అని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ అమలు చేసిన “కూడు–గుడ్డ–నీడ” సంక్షేమ భావనతోనే ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. జనతా వస్త్రాల పథకం స్ఫూర్తితోనే ఆడబిడ్డలకు “ఇందిరమ్మ చీరలు” పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
“ఇందిరమ్మ ఆశీర్వాదం, ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రజాపాలనలో ప్రతిఫలిస్తోంది. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. వారిద్దరి కలయికే ఈనాటి ప్రజాపాలన” అని సీఎం పేర్కొన్నారు.
మహిళా సాధికారతపై మాట్లాడుతూ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించగా, ఎన్టీఆర్ వాటిని సమర్థవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సహకారంతోనే ప్రజాపాలన ముందుకు సాగుతోందని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రజలు అండగా నిలవాలని సీఎం కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





